Monday, May 4, 2009

సమర కిశోరం - భగత్ సింగ్

సమస్త భారత ప్రజానికము మార్చ్ 3 వ వారము విద్యావ్యాసంగము, పరీక్షలు, ఆర్ధికమాంద్యము, తీవ్రవాదపు సమస్య, ఎన్నికలు వంటి తీరికలేని దైనందిన జీవితపు వ్యవహారాలలో తలమునకలై యుండగా, చెరసాలలు, ఉరికొయ్యలు, పూలశయ్యలు, పూలమాలలుగా మార్చుకొని, తమ రుధిర తర్పణతో సమస్త భారతావనికి స్వాతంత్ర్య సమర స్ఫూర్తి రగల్చిన ముగ్గురు త్యాగధనుల బలిదానమును మరిచింది.

ఆ ముగ్గురు యువకిశోరాలు ఎవరో కాదు.

"ఇంక్విలాబ్ జిందాబాద్" నినాదాన్ని జాతి జీవన గీతముగా మార్చిన భగత్ సింగ్.

జనని భారతి శృంఖలాల ఛేదనకై తమ భౌతిక దేహాన్ని తుచ్ఛంగా భావించిన రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ లు.

68 సంవత్సరాల క్రితము మార్చ్ 23 వ తేదినాడు ఈ భరతమాత ముద్దు బిడ్డలు పాశ్విక బ్రిటిష్ కర్కశ చట్టాల చట్రాల పదఘట్టనలో నలిగిపోబడి, ఉరికొయాలను కౌగిలించకపోయి ఉంటే, ఆ ముగ్గురు తాతయ్యలై, మనజాతికి, మన తరానికి మార్గదర్శకులై దేశభక్తి, జాతి రక్షణల పాఠాలు నేర్పేవారేమో? రాజ్ గురు, సుఖ్ దేవ్ లలో స్వేచ్ఛ, స్వాతంత్ర్య దీక్షా జ్వాలలు రగిల్చి, జాతి మొత్తానికి ఆదర్శమై నిలిచిన భగత్ సింగ్ నాటికీ, నేటికీ స్తవనీయుడు, స్మరణీయుడు.

పారతంత్ర్య ధిక్కరణ భగత్ సింగ్‍కు ఆనువంశికంగా వచ్చిన ఆస్తి. "ఆచ్చట పుట్టిన చివురు కొమ్మైన చేవ" అన్నట్టుగా ఆ వంశంలో ప్రతి ఒక్కరి రక్తంలో విప్లవకాంక్ష ప్రవహిస్తుండేది. తమ ఇంట్లో జరిగే స్వాతంత్ర్య సమరవీరుల చర్చా గోష్ఠులు, మధ్య మధ్యలో బ్రిటిష్ సైన్యంవారి అక్రమ హింసలు, తండ్రి మరియు ఇతర కుటుంబ సభ్యుల దేశ భక్తి - భగత్ సింగ్‍లో చిన్న నాటనే స్వేచ్ఛాకాంక్షకు ఊపిరిలూదాయి.

పరమ సిఖ్ ధార్మిక కుటుంబంలో పుట్టినప్పటికీ, సిఖ్ సహజ ధార్మిక వస్త్ర ధారణ ఇత్యాదులను త్యజించి, "నేనెందుకు నాస్తికుడినయ్యాను" అనే గ్రంథాన్ని రచించేలా ప్రేరేపించే వ్యక్తిత్వం అలవడ్డాయి.

సంసార చట్రంలో ఇరుక్కుంటే, జాతి కన్నీటిని తుడిచే ఒక సేవకుడు తగ్గిపోతాడన్న భావన అతడిని పెళ్ళిచేసుకోకుండా చేసాయి. పుట్టుకనుంచి ఉరికొయ్యని కౌగిలించేవరకు, ఆయన నమ్ముకున్న సామ్యవాద సిద్ధాంతం, తాను చేసే పోరాటం ప్రపంచ బడుగు బలహీన వర్గాలవారు సకల ధనిక వర్గ శక్తులతో జరిపే పోరాటంగా మార్చాలనేది అతడి తపన.

దైవంకన్నా ధ్యేయమును నమ్మిన వ్యక్తి ఎంత ధృడంగా ఉంటాడో అనడానికి భగత్ సింగ్ వ్యక్తిత్వం నిలువెత్తు దర్పణం. రాజ్ గురు, సుఖ్ దేవ్, భగత్ సింగ్‍లను ఒకరి తరువాత ఒకరిని ఉరి తీస్తామని జైలు అధికారులు తెలిపితే, "నన్ను ముందు ఉరి తీయండి" అని ప్రకటించిన భగత్ సింగ్ సాహసం స్వాతంత్ర్య సమర వీరులకు స్ఫూర్తిదాయకం.

మనిషి ఎలా చనిపోతాడు అనేదానికన్నా, మృత్యువును ఎలా ఎదురుకుంటాడు, ఏ ధ్యేయంకై మృత్యువును ఆహ్వానిస్తాడు అన్న విషయాన్ని పరిశీలిస్తే, మాతృదాస్య శృంఖలాల ఛేదనకై ఉరితాడుని ఆహ్వానించిన భగత్ సింగ్ ఔన్నత్యం భావి తరాలకు మార్గదర్శకం.

కొంత మంది బ్రిటిష్ పోలీసులను ఒక ఇంట్లో పెట్టి ఉద్యమకారులు దహించి వేసిన చౌరి-చౌరా సఘటన ఆనంతరం బాపూజీ నిరసన, నిరశనలు చేపట్టడమే కాక, ఊపందుకున్న సహాయ-నిరాకరణోద్యమము కూడా రద్దు చేయడము, పైగా అదే గాంధీజి కర్తార్ సింగ్ వంటి ఉద్యమకారుల బలిదానానికి శ్రద్ధాంజలి అయినా ఘటించకపోవడం వంటి సంఘటనల నేపధ్యములో భగత్ సింగ్ గాంధీజీని ధిక్కరించాడు. కానీ, అందరూ అనుకున్నట్టుగా గంధీజీని భగత్ సింగ్ ద్వేషించలేదు.

No comments: