Monday, May 4, 2009

ఉగాది [పద్య కవిత]

ప్రాగారమ్ములు కళగా
రాగమతిశయించి ప్రేమ రాగము నింవెన్
వేగముగా ఏతెంచుము
స్వాగతమో నవ ఉగాది! శాంతవిహారీ!

ప్రకృతి కోయిల తీయగా పాడు చుండ
చిగురు మావిళ్ళు లేలేత సిగ్గునొంద
వేము కష్ట సుఖాలతో వింది చేయ
వేగ రావమ్మ నవవర్ష స్వాగతమ్ము!

మానవత్వమ్ము నశియించి దానవత్వ
మావరించెను మంచి సమాధి చెందె
శాంతి గీతాలు గుండెలో క్రాంతి నింప
కోకిలా తీయగాపాడు కొసరి కొసరి!

సమర సన్నాహ వేదిక శంఖమూద
ఆకసమ్మున బాంబులు ఆటలాడ
సకల జనుల బాధలుదీర్చ జాగులేక
వేగరావమ్మ నవవర్ష స్వాగతమ్ము!

పెళ్ళి సందడి నిండుగా వెలయునట్లు
అలర బ్రహ్మోత్సవములెల్ల అమరునట్లు
పంచభూతాల దూతవై పరుగు తోడ
వేగరావమ్మ నవవర్ష స్వాగతమ్ము!

- శేషం సుప్రసన్నాచార్యులు
[తెలుగు ఉపాధ్యాయుడు]

No comments: